Murali's Telugu Blog

All | General | Status | Java | Music | Politics
« మల్లికార్జున్ | Weblog | సహాన »
20080806 Wednesday August 06, 2008

సాంప్రదాయ సాహిత్యం తెలుగులో గొప్ప కావ్యాల గురించి చెప్పేవారు ఉదహరించే వాటిల్లో రుక్మిణీ కల్యాణం (పోతన), గజేంద్ర మోక్షం(పోతన), మనుచరిత్ర(పెద్దన) ముందుంటాయి. వాటి గురించి తెలియని వారికి పరిచయం చేయాలని ఈ సరదా ప్రయత్నం.

DTLC పుణ్యమా అని పుస్తకాలు ఇంట్లోకి చేరాయికాని బుర్రలోకి ఏమీ ఎక్కలేదు. రుక్మిణీ కల్యాణం, గజేంద్ర మోక్షం, మనుచరిత్ర పుస్తకాలు ఎవరినోట విన్నా ఆహా, ఓహో అంటారు. తెరిచి చూద్దును కదా, కందలూ, గీతాలూ ఆకర్షించినా శార్దూలాల అరుపులు, మత్తేభాల ఘీంకారాలు భయపెట్టాయి. మూడు పుస్తకాలు ఒకేలాగా అనిపించాయి. కాలక్షేపానికి కనువిందు చేసే సినిమాలుండగా ఈ కష్టమైన కావ్యాలు కావాలా అనిపించేది. చదవగా చదవగా అక్కడో పద్యం ఇక్కడో పద్యం ఆకర్షించాయి. ప్రస్తుతం మూడింటి మీదా పట్టు ఫర్వాలేదు. ఒంటబడుతున్నాయి. శార్దూలాల పరుగులు, మత్తేభాల వయ్యారాలు, చంపకోత్పలమాలల సుగంధాలు తెలుస్తున్నాయి.

మనం ఆనందించే వాటిని నలుగితో పంచుకోవాలనే చాపల్యం మామూలు కదా. అందుకే ఈ ప్రయత్నం. మొదట ఒకేలాగా అనిపించినా మూడు కావ్యాలలో ఉన్న సరుకు వేరు.

మొదట రుక్మిణీ కల్యాణం. ఒక హీరోయిన్, హీరో, విలన్. టిపికల్ ప్రేమకథ. ఇప్పటికీ మనవాళ్లు అటుతిప్పి ఇటుతిప్పి ఈ కథతో మన బుర్రలు వాయగొడుతున్నారు. మొదటి సీన్లో రుక్మిణీ, కృష్ణులు ఒకరికోసం ఒకరు పుడతారు. విలన్ రుక్మి (రుక్మిణి అన్న) చెల్లెలిని శిశుపాలునికి ఇచ్చి పెళ్లి నిర్ణయిస్తాడు. హీరోయిన్ హీరోకి వర్తమానం పంపిస్తుంది. హీరో ఆఘమేఘాలమీద వస్తాడు. ఈలోగా ఆతృతతో హీరోయిన్ మాంచి sad song వేసుకునే చాన్స్. గుడికి వెళ్లిన హీరోయిన్ని లేవదీసుకొని వస్తాడు. వెంబడించిన విలన్తో, మాంచి ఫైటు. ఓడిస్తాడు. కథ సుఖాంతం.

తరువాత గజేంద్ర మోక్షం. ఇది 90వ దశకం మునుపు వచ్చిన పదకొండు గంటల సినిమాల టైపు. గొప్ప భక్తి రస చిత్రం. తేడా అల్లా, ఇక్కడ హీరో ఒక ఏనుగు, కష్టాలు-కన్నీళ్లు మొసలి రూపంలో వస్తాయి. First halfలో మన హీరో లెక్క లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. ఇంటర్వల్ టైంకి నీళల్లో మొసలి పట్టుకుంటుంది. Struggles start. Second halfలో సీనుసీనుకి భక్తి రసం పెరిగి క్లైమాక్స్‌లో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. గజేంద్రుడికి మోక్షం ప్రసాదిస్తాడు.

ఇక మనుచరిత్ర. ఇది కత్తి-కాంతారావు లాంటి జానపద చిత్రం. మాయలు, మంత్రాలు, మారువేషాలు, చిత్రవిచిత్రమైన మలుపులున్న కథ. టూకీగా కథ ఇది. ప్రవరుడు అనే బ్రాహ్మణుడు మాయా లేపనం రాసుకొని హిమాలయాలకు వెళ్తాడు. తప్పిపోయి తిరుగుతున్న ఇతన్ని అక్కడ వరూధిని అనే గంధర్వ కన్య ప్రేమిస్తుంది. ఇతను తిరస్కరించి అగ్నిదేవుడిని స్మరించి తపోశక్తితో ఇంటికి రాగలుగుతాడు. ఒక గంధర్వుడు ప్రవరుని రూపంలో వచ్చి విరహంతోనున్న వరూధినిని నమ్మించి వంచిస్తాడు. అక్కడకు ఇంటర్వెల్. మిగిలినది కథ కావాలంటే మనుచరిత్ర చదవాల్సిందే.

ఇలా సాంప్రదాయ కవిత్వం ముసుగులో ఉన్న "గొప్ప" కావ్యాలను మన దర్శకులు ఎంచక్కా పాటలూ, ఫైటులున్న ఫిల్ముల్లో ఎక్కించేసారని మనవి.

Posted by Murali ( Aug 06 2008, 02:12:12 PM EDT ) Permalink

Comments:

Comments are closed for this entry.

Calendar

RSS Feeds

Search

Links

Navigation

Referers